
“హరి హర వీర మల్లు” సినిమాలో హీరో పవన్ కళ్యాణ్. కానీ ఆయన తన సినిమాలను ప్రచారం చెయ్యరు. రాజకీయాలకు సంబంధం లేనప్పుడు కూడా ఆయన తన సినిమాల ప్రమోషన్లకు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన ఏకంగా ఆంధ్రపదేశ్ ఉపముఖ్యమంత్రి. మరి అంత పెద్ద పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ షూటింగ్ కి డేట్స్ ఇవ్వడమే గొప్ప వరంగా భావిస్తున్నారు నిర్మాతలు. ఇక ప్రమోషన్ ఇంటర్వ్యూలు అడగగలరా?
అందుకే, ఈ సినిమాకి సంబంధించినంతవరకు మొత్తం భారమంతా నిధి అగర్వాల్ పైనే.
“హరి హర వీర మల్లు” సినిమాలో ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించింది. ఈ సినిమా మే9న విడుదల కానుంది. విడుదలకు ఇంకా నెలన్నరపైనే ఉంది. ఈ గ్యాప్ లో ప్రమోషన్ కోసం ఈ అమ్మడిని రీల్స్ అంటూ రంగంలోకి దింపారు నిర్మాతలు.
ఆమె ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ చిత్రం. ఒకవేళ ఈ సినిమాని జాతీయ స్థాయిలో బీజేపీ గ్యాంగ్ ఆదరిస్తే పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో పడుతుందని ఆశపడుతోంది.
పైగా ఈ సినిమా కోసం మూడేళ్లపైనే కష్టపడింది. కాబట్టి ఈ సినిమా ప్రచార బాధ్యతని తీసుకొంది. ఇక సిటీ టూర్లకు, ఈవెంట్లకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.