దర్శకుడు సుకుమార్ ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అయినా, ఆ పద్దతి మారడం లేదు. తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి ఎదిగింది అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ కాలంలో కూడా ఆయన విడుదల తేదీకి ఒక వారం ముందు కూడా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చెయ్యరు.
ప్రపంచవ్యాప్తంగా 11000 వేల స్క్రీన్ లలో విడుదల చేయబోతున్నట్లు “పుష్ప 2” గొప్పలు చెప్పుకుంటోంది. కానీ, విడుదలకు 25 రోజులే ఉంది కానీ షూటింగ్ పూర్తి కాలేదు. సుకుమార్ ప్రస్తుతం ఐటెం సాంగ్ తీస్తున్నారు. ఇక సెన్సార్ కి వెళ్లేందుకు కేవలం 15 రోజుల టైం మాత్రమే ఉంది. ఈ గ్యాప్ లో నేపథ్య సంగీతం మొత్తం పూర్తి చేసుకోవాలి.
దాంతో, ఇప్పుడు టీం టెన్షన్ పడుతోంది. కేవలం దేవీశ్రీప్రసాద్ తోనే ఈ 15 రోజుల్లో పని పూర్తి అవకపోవచ్చనే టెన్షన్ తో ఇప్పుడు మరో సంగీత దర్శకుడి సహాయం తీసుకోవాలని టీం భావిస్తోంది. ఇప్పటికే తమన్, ‘కాంతార’ సంగీత దర్శకుడు అజనీస్ ని సంప్రదించారట.
ఈ సినిమాని మూడేళ్ళుగా తీస్తున్నారు సుకుమార్. సీక్వెల్ సినిమాకి 3 ఏళ్ళు కూడా సుకుమార్ కి సరిపోలేదు. చివర్లో ఇలా అవస్థ.