
సాయిపల్లవికి పడిపోయిన దర్శకుల జాబితాలోకి సందీప్ రెడ్డి వంగ కూడా చేరాడు. ఇప్పటికే మణిరత్నం లాంటి మేటి దర్శకుల్ని మెప్పించిన ఈ హీరోయిన్, తన యాటిట్యూడ్ తో సందీప్ వంగాను కూడా మెస్మరైజ్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందో, సందీప్ మాటల్లోనే..
“అర్జున్ రెడ్డి సినిమాకు హీరోయిన్ కోసం ఆలోచిస్తుంటే, కేరళ నుంచి ఓ కో-ఆర్డినేటర్ టచ్ లోకి వచ్చాడు. సాయిపల్లవి కావాలని అడిగాను. సినిమాలో రొమాంటిక్ సీన్లు ఉంటాయా అని అడిగాడు. కొంచెం ఉంటాయని చెప్పాను. ఆమె స్లీవ్ లెస్ బట్టలే వేసుకోదు, రొమాన్స్ ఎందుకు చేస్తుంది, మరిచిపోండి అన్నాడు. అప్పుడు సాయిపల్లవి ఎలా ఉందో, ఇప్పటికీ ఆమె అలానే ఉంది. ఏం మారలేదు.”
కెరీర్ ముందుకెళ్లేకొద్దీ హీరోయిన్లు మారుతుంటారని, సాయిపల్లవి మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒకే మైండ్ సెట్ తో ఉందని, అది తనకు బాగా నచ్చిందని అంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. ‘తండేల్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు ఈ పాన్ ఇండియా దర్శకుడు.
నిజానికి ఇదే ఫంక్షన్ కు అల్లు అర్జున్ రావాల్సి ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తొలిసారి అతడు ఈ ఫంక్షన్ తో వేదికపైకి వస్తాడని అల్లు ఆర్మీ ఎదురుచూసింది. కానీ ఒంట్లో బాగాలేకపోవడం వల్ల బన్నీ హాజరుకాలేకపోయాడు.