హీరోయిన్లంతా అందంగానే ఉంటారు. కానీ వాళ్లలో అతికొద్ది మంది మాత్రమే అదృష్టవంతులుంటారు. మిగతా వాళ్లలో చాలామంది ఇంటికెళ్లిపోతారు. ఇంకా మిగినవాళ్లు కిందామీద పడి కెరీర్ కొనసాగిస్తుంటారు. రితికా నాయక్ పరిస్థితి కూడా ఇదే.
ఓ హిట్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, ఆ క్రేజ్ ను కంటిన్యూ చేయలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు అందుకోలేకపోయింది. తప్పుడు నిర్ణయాలు కొన్నయితే, అందివచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్న తప్పులు మరికొన్ని. ఫలితంగా ఇన్నేళ్లయినా రితికా నాయక్ కు బ్రేక్ దొరకలేదు.
‘అశోకవనంలో అర్జునకల్యాణం’ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది రితిక. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. రితికా అందాలకు, ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
కానీ వెంటవెంటనే అవకాశాలు రాలేదు. కొన్ని ఆఫర్లను ఆమె తిరస్కరించింది. అలా అవకాశాలు తగ్గిపోవడంతో ‘హాయ్ నాన్న’ సినిమాలో ఓ చిన్న రోల్ చేయాల్సి వచ్చింది. అది హిట్టయినా ఆమెకు లక్ కలిసిరాలేదు.
ప్రస్తుతం ‘మిరాయి’ అనే సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెట్స్ పై ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తోంది ఈ మూవీ.