రానా-అనిరుధ్ కలిశారు. కొత్త సినిమా కోసం వీళ్లు చేతులు కలపలేదు. ఓ కంపెనీలో వీళ్లిద్దరూ కలిసి పెట్టుబడి పెట్టారు. అది కూడా ఓ లిక్కర్ కంపెనీ. మైక్రో బ్రూవరీ ఐరన్ హిల్ ఇండియా యజమాని వడ్లమూడి శ్రీహర్షతో కలిసి వీళ్లిద్దరూ పెట్టుబడులు పెట్టారు. వీళ్ల ముగ్గురి పెట్టుబడి విలువ 10 మిలియన్ డాలర్లు.
ఈ పెట్టుబడితో వీళ్లు సరికొత్త టకీలా బ్రాండ్ ను ఇండియాకు పరిచయం చేయబోతున్నారు. మెక్సికోలో పండించే అగావే అనే మొక్క నుంచి ఈ మద్యాన్ని తయారుచేస్తారు. కాక్టస్ జాతికి చెందిన మొక్క ఇది. దీన్ని అక్కడ లోకా లోకా అని పిలుస్తారు. ఇండియా, అమెరికాలో టకీలా అంటారు.
త్వరలోనే ఈ బ్రాండ్ అమ్మకాలు అమెరికాలో మొదలుకానున్నాయి. మరో 18-24 నెలల్లో ఇండియాలో కూడా అమ్మకాలు మొదలవుతాయి.
ఈ సరికొత్త టకీలానాను సెలబ్రేషన్ డ్రింక్ గా అభివర్ణిస్తున్నాడు రానా. తెలంగాణలో సంబరాలు చేసుకునే క్రమంలో ఆనవాయితీగా కల్లు తాగుతారని, రానురాను డ్రింకింగ్ అలవాట్లలో మార్పులొస్తున్నాయి. ఆ మార్పుల్ని ఆహ్వానిస్తూ.. రాబోయే రోజుల్లో టకీలా అనేది సెలబ్రేషన్ డ్రింక్ గా మారుతుందని అంటున్నాడు రానా.
మద్యం బ్రాండ్స్ లో పెట్టుబడులు పెట్టడం రానాకు ఇదే తొలిసారి కాదు. గతంలో జిన్ తయారుచేసే ఓ బ్రూవరీలో డబ్బులు పెట్టాడు ఈ నటుడు. ఇప్పుడు అనిరుధ్ తో కలిసి పెట్టుబడులు విస్తరిస్తున్నాడు.