
హెడ్డింగ్ కాస్త అయోమయంగా ఉందా.. ఎలాంటి గందరగోళం అక్కర్లేదు.. తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చరణ్ వెళ్లాడు. ప్రస్తుతం ఈ హీరో లండన్ లో ల్యాండ్ అయ్యాడు. సతీసమేతంగా లండన్ లో దిగిన రామ్ చరణ్ మరో వారం రోజుల పాటు అక్కడే ఉంటాడు.
9వ తేదీన తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించి, దాని సరసన సెల్ఫీ దిగబోతున్నాడు. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరింది చరణ్ మైనపు విగ్రహం. ఈ మైనపు ప్రతిమను తయారుచేసేందుకు, లండన్ నుంచి ప్రత్యేకంగా ఓ టీమ్ హైదరాబాద్ వచ్చి మరీ చరణ్ కొలతలు తీసుకెళ్లింది.
టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. తన పెట్ డాగ్ రైమ్ తో కలిసి ఈ మైనపు విగ్రహానికి కొలతలిచ్చాడు చరణ్. టుస్సాడ్స్ లో ఇలా పెంపుడు కుక్కతో మైనపు విగ్రహం ఏర్పాటవ్వడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఏ భారతీయ నటుడు లేదా సెలబ్రిటీకి ఈ గౌరవం దక్కలేదు.
దీనిపై చరణ్ స్పందించాడు కూడా. రైమ్ కు కూడా చోటిస్తేనే మైనపు విగ్రహానికి ఓకే చెబుతానని చరణ్ కండిషన్ పెట్టాడు. ఈ మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం ‘పెద్ది’ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చాడు ఈ హీరో.