బిడ్డకు జన్మనిచ్చిన ఏ తల్లయినా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటుంది. ఇక హీరోయిన్ల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఫిజికల్ గా ఫిట్ గా తయారయ్యేందుకు, తగ్గిన గ్లామర్ ను మెరుగుపరుచుకునేందుకు చాలా టైమ్ తీసుకుంటారు. అయితే ప్రణీత మాత్రం దీనికి అతీతం.
బిడ్డకు జన్మనిచ్చి 15 రోజులైనా తిరక్కముందే, ముఖానికి రంగేసుకుంది ప్రణీత. ఓ అవార్డ్ ఫంక్షన్ లో రెడ్ కార్పెట్ పై మెరుపులు మెరిపించింది. ఇంత తక్కువ టైమ్ లో ఆమె తిరిగి యాక్టివ్ అవ్వడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
కరోనా టైమ్ లో వ్యాపారవేత్త నితిన్ ను పెళ్లాడింది ప్రణీత. పెళ్లయిన ఏడాదికే పాపకు జన్మనిచ్చింది. 2022లో పాప జన్మించింది. ఇప్పుడు రెండేళ్ల గ్యాప్ లో మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలకు తల్లయినా ప్రణీతలో అందం చెక్కుచెదరలేదు.
ఓవైపు ఇలా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు సినిమాల్లో కూడా కొనసాగుతోంది ప్రణీత. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలు చేస్తోంది. బాబు పుట్టిన తర్వాత ఆమె గ్యాప్ తీసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ 10 రోజులు కూడా తిరక్కుండానే రెడ్ కార్పెట్ పైకొచ్చి అందర్నీ ఆకర్షించింది.