పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాకముందే తన షూటింగ్ డేట్స్ విషయంలో అసలు కమిట్ మెంట్ చూపించేవారు కాదు. షెడ్యూల్ మొదలు అయిన రెండో రోజేకే ఆయన మూడ్ మార్చుకొని నిర్మాత జేబుకు చిల్లు పెట్టిన సందర్భాలు అనేకం. ఇక ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి. ఎన్డీయే కూటమిలో కీలక నేత.
పైగా, కేంద్ర బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ ని దక్షిణాదిలో కీలక హిందుత్వ నాయకుడిగా మలిచే ఆలోచనలో ఉంది. అందుకే ఆయన కూడా “చేగువేరా”ని ఎప్పుడో మర్చిపోయారు ఇప్పుడు “యోగి” బాటలో వెళ్తున్నారు. ఇటీవలే ఆయన “హరి హర వీర మల్లు” షూటింగ్ ని విజయవాడలో స్టార్ట్ చేశారు. రెండు రోజుల తర్వాత తిరుపతి లడ్డు వివాదం రావడం, దాంతో “సనాతన ధర్మ” “పరిరక్షకుడి”గా పవన్ కళ్యాణ్ మారిపోవాలనుకోవడంతో షూటింగ్ ఆగిపోయింది.
నిన్న (గురువారం) ఆయన తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించారు. “I am an unapologetic Sanatani Hindu (సనాతన ధర్మాన్ని ఎటువంటి సంకోచం లేకుండా పాటించే హిందువుని)” అని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన దీక్ష ముగిసింది.
మరి, ఇక హరి హర వీర మల్లు షూటింగ్ మొదలు పెడుతారా?
ఈ సినిమాని త్వరలోనే మళ్ళీ స్టార్ట్ చేసి వెంటనే పూర్తి చేస్తారా? చూడాలి ఏమి జరుగుతుందో. పవన్ కళ్యాణ్ కోసమే విజయవాడ సమీపంలోనే ఒక భవంతి తీసుకోని స్టూడియో సెట్ వేశారు నిర్మాత రత్నం. అయినా, పవన్ కళ్యాణ్ కి ఉన్న రాజకీయ, ప్రభుత్వ కమిట్ మెంట్ల వల్ల ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం.