2024 ముగిసింది. హీరో అల్లు అర్జున్ కి ఈ ఏడాది కళ్ళు చెదిరే హిట్ దక్కింది. కానీ ఆనందం మాత్రం లేదు.
భారీ అంచనాల మధ్య విడుదలైన “పుష్ప 2” హిందీ మార్కెట్లో అతిపెద్ద విజయంగా నిలిచింది. ఇప్పటివరకు ఏ హిందీ సినిమా కూడా ఇండియాలో 700 కోట్ల వసూళ్లు అందుకోలేదు. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు సాధ్యం కాలేదు. కానీ అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” ఏకంగా 800 కోట్ల వసూళ్లకు దగ్గర్లలో ఉంది. హిందీ మార్కెట్ ని అల్లు అర్జున్ వశం చేసుకున్నాడు. ప్రభాస్ తర్వాత హిందీ మార్కెట్ ని పొందిన తెలుగు హీరో అల్లు అర్జున్.
రాజమౌళి సినిమాలో నటించకుండా సొంతంగా ఇంత విజయం అందుకున్న హీరో కూడా బన్నీనే. ఇది చాలా గొప్ప విజయం. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట, ఆ ఘటనలో ఒక మహిళ మరణించడం, ఆ తదనంతర పరిణామాల్లో అల్లు అర్జున్ ఘోరంగా ఇరుక్కున్నాడు. కొన్ని స్వీయ తప్పిదాలు, మరికొన్ని కుట్రల కారణంగా అల్లు అర్జున్ బలి అయ్యాడు. ఏకంగా ఒకరోజు జైలులో ఉండాల్సి వచ్చింది.
“రాజమౌళి సాయం లేకుండా పాన్ ఇండియన్ మార్కెట్ అందుకున్న ఏకైక తెలుగు హీరో బన్నీనే,” అని అభిమానులు ఆనందంగా సోషల్ మీడియాలో రాసుకుంటే బన్నీ వ్యతిరేకులు “ఒక రోజు జైల్లో ఉన్న ఏకైక తెలుగు హీరో కూడా బన్నీనే,” అంటూ ట్రోల్ చేశారు.
ఈ కేసుని మాఫీ చేయించుకునేందుకు అల్లు అరవింద్ – దిల్ రాజు చేసిన ప్రయత్నం చివరికి ఫలించింది. హైదరాబాద్ ని ప్రపంచ ఫిలింమేకింగ్ కి హబ్ కాబోతోంది అని ఒక బహానా బాతాఖానీ చెప్పి మొత్తానికి కేసు మరింత ముందుకెళ్ళకుండా చేసుకున్నారు.
ఈ కేసు కారణంగానే అల్లు అర్జున్ ఎటువంటి సంబరాలు చేసుకోలేకపోయాడు. “పుష్ప 2” టీం తమ రికార్డులను పోస్టర్లు షేర్ చెయ్యడం వరకే పరిమితం అయ్యింది. ఎటువంటి విజయోత్సవాలు జరుపుకోలేకపోయింది.