‘మెక్సికన్ వేవ్’ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. క్రికెట్ లేదా ఫుట్ బాల్ స్టేడియంలో క్రమబద్ధంగా ప్రేక్షకులు లేచి గోల చేయడం. లాంగ్ షాట్ లో చూస్తే, ఇదంతా ఓ పెద్ద అలలా కనిపిస్తుంది. దానికి ముద్దుగా ‘మెక్సికన్ వేవ్’ అని పేరుపెట్టారు.
కెరీర్ ప్రారంభంలో నయనతార నడుమును మెక్సికన్ వేవ్ తో పోలుస్తూ కామెంట్స్ చేశారు చాలామంది. ఆమె నడుము అంత పెద్దగా ఉందనేది దానర్థం. అప్పట్లో ఆమె కాస్త లావుగా ఉండేది మరి.
దీనిపై నయనతార స్పందించింది. ఏ హీరోయిన్ కు ఎదురుకాని విధంగా, కెరీర్ ప్రారంభంలోనే తను బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నానని వెల్లడించింది.
“గజనీ సినిమా పెద్ద హిట్. కానీ అదే నాకు పెద్ద దెబ్బ. ఆ సినిమాలో నా గురించి వచ్చిన కామెంట్స్ అన్నీఇన్నీ కావు. బాగా లావుగా ఉంది, అసలెందుకు తీసుకున్నారనే విమర్శలొచ్చాయి. నా జీవితంలో తొలి బాడీ షేమింగ్ అదే. అప్పట్లో నాకు ఎవ్వరూ అండగా లేరు. మన పరిస్థితి బాగాలేనప్పుడు ఎవ్వరూ మనకు అండగా నిలబడరు. ఇట్స్ ఓకే అని చెప్పే మనిషి కూడా నా చుట్టుపక్కల్లేరు. ఆ క్షణం నుంచే నేను స్ట్రాంగ్ గా తయారవుతూ వచ్చాను. ఎందుకంటే, నాకు వేరే ఆప్షన్ లేదు.”
ఇలా కెరీర్ లో తన తొలి బాడీషేమింగ్ అనుభవాన్ని బయటపెట్టింది నయనతార.