మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవితో తమ అనుబంధాన్ని చాలామంది పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు వశిష్ఠ మల్లిడి. చిరంజీవితో “విశ్వంభర” సినిమా చేస్తున్న ఈ డైరెక్టర్.. చిరంజీవికి-కాఫీకి మధ్య ఉన్న విచిత్రమైన అనుబంధాన్ని బయటపెట్టాడు.
అదేంటంటే కాఫీ తాగుదామని చిరంజీవి ఎప్పుడు ప్రయత్నించినా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుందంట. “విశ్వంభర” సెట్స్ లో జరిగిన ఘటనను బయటపెట్టాడు
“విశ్వంభర” సెట్స్ కు ఉదయాన్నే వస్తారంట చిరంజీవి. ప్యాకప్ చెప్పేంతవరకు లొకేషన్ లోనే ఉంటారట. దర్శకుడు షాట్ రెడీ చేసుకునే గ్యాప్ లో కాఫీ తాగడానికి రెడీ అవుతారంట. ఎప్పుడైతే కాఫీ సిద్ధమై, ఇలా తాగడానికి రెడీ అవుతారో ఆ వెంటనే దర్శకుడు వచ్చి “సర్.. షాట్ రెడీ” అంటాడట.
ఇదేదో “విశ్వంభర” సెట్స్ లో మాత్రమే జరిగేది కాదని, తనకు ప్రతి సినిమాలో ఇదే అనుభవం ఎదురవుతుందని చిరంజీవి చెప్పుకొచ్చారట. తనకు కాఫీకి ఏదో విచిత్రమైన లింక్ ఉందని, సరిగ్గా తాగే టైమ్ కు షాట్ రెడీ అంటూ ఎవరో ఒకరు వస్తారని చెప్పుకొచ్చారట చిరంజీవి.
కాఫీ తాగిన తర్వాత షాట్ చేద్దామని దర్శకుడు అడిగినా చిరంజీవి వద్దని అనేవారంట. కాఫీ తనకోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధంగా ఉంటుందని, షాట్ లో సిబ్బంది మొత్తం తన కోసం వెయిట్ చేయడం తనకు నచ్చదని అనేవారంట చిరంజీవి. మొత్తానికి సినిమా ఏదైనా, కాఫీ తాగే టైమ్ కు షాట్ రెడీ అనే పిలుపు మాత్రం చిరంజీవిని ఇబ్బంది పెడుతోందని చెప్పుకొచ్చాడు వశిష్ఠ.