ఇదొక త్రికోణం ప్రేమ. అలా అని సినిమా కాదు, నిజజీవిత కథ. హీరో రాజ్ తరుణ్, లావణ్య అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. కలిసి కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు. ఈ విషయాన్ని రాజ్ తరుణ్ కూడా అంగీకరించాడు.
సడెన్ గా వీళ్ల మధ్యలోకి ఓ హీరోయిన్ వచ్చింది. పేరు మాల్వి మల్హోత్రా. రాజ్ తరుణ్ కొత్త సినిమా “తిరగబడరా సామీ” సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. కేవలం కెమెరా ముందు రాజ్ తో కలిసి నటించడమే కాదు, కెమెరా వెనక కూడా రాజ్ తో కలిసే ఉంటోందనేది లావణ్య ఆరోపణ.
దీంతో మాల్వీ మల్హోత్రా పేరు మారుమోగిపోయింది. తన 5 పేజీల కంప్లయింట్ లో మాల్వీ గురించే ఎక్కువగా రాసుకొచ్చింది లావణ్య.
తన ప్రియుడు రాజ్ తరుణ్, మాల్వీ మోజులో పడ్డాడని, ఆమె కోసం రాజ్ తరచుగా ముంబయి వెళ్లాడని ఆరోపించింది. అట్నుంచి అటు వాళ్లిద్దరూ చెన్నై, పాండిచ్చేరి లాంటి ప్రాంతాల్లో తిరిగారని, ఓ దర్శకుడి ఇంట్లో ఇద్దరూ కాపురం కూడా పెట్టారనేది లావణ్య ఆరోపణ.
అక్కడితో సినిమా అయిపోలేదు. రాజ్ తరుణ్ ను మరిచిపోవాలంటూ మాల్వి సోదరుడు, తండ్రి లావణ్యకు వార్నింగ్స్ ఇచ్చారంట. అవసరమైతే డబ్బులు తీసుకొని సెటిల్ చేసుకోవాలని సూచించారట.
ఇంత జరిగిన తర్వాత మాల్వి పేరు మారుమోగకుండా ఉంటుందా..? అన్నట్టు “తిరగబడరా సామి” సినిమా ప్రమోషన్ కోసం మొన్ననే ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మాల్వి ఇంటర్వ్యూ కోసం ఎగబడుతున్నారు.