
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో కోమలీ ప్రసాద్ కూడా ఉంది. ఈమె కూడా వైద్యురాలు అవ్వబోయి నటిగా మారింది.
అయితే ఇప్పుడు యాక్టర్ నుంచి తిరిగి డాక్టర్ అయినట్టు వరుసగా కథనాలొస్తున్నాయి.
తాజాగా తెల్ల కోటు ధరించి కొన్ని ఫొటోలు పెట్టింది కోమలీ. తను డెంటిస్ట్ అవతారం ఎత్తానని, అందరూ సిద్ధంగా ఉండాలంటూ పోస్టు పెట్టింది. ఈ పోస్టు చూసిన చాలామంది ఆమె నటనకు గుడ్ బై చెప్పినట్టు రాసుకొచ్చారు. దీనిపై కోమలి స్పందించింది.
తను నటనను ఆపేస్తున్నానంటూ వస్తున్న కథనాల్ని ఖండించింది ఈ హీరోయిన్. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని, భవిష్యత్తులో కూడా నటిగా కొనసాగుతానని స్పష్టం చేసింది. తన వ్యాఖ్యల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని, ఇకపై కూడా సినిమాల్లోనే కొనసాగుతానని ఆమె తెలిపింది.

రీసెంట్ గా ‘హిట్-3’ సినిమాతో మెరిసింది కోమలీ ప్రసాద్. త్వరలోనే ఆమె మరిన్ని సినిమాలు ప్రకటిస్తానని తెలిపింది. ప్రస్తుతం మంచి స్క్రిప్టులు వింటోందంట.