![Kajal Aggarwal](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/10/kajal-aas.jpg)
కాజల్ అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకొని “భారతీయుడు 2” సినిమా చేసింది. కమల్ హాసన్ సరసన నటించే అవకాశం వచ్చినప్పుడు గర్వంగా ఫీల్ అయింది. ఐతే, ఆ సినిమా అనేక సమస్యలు ఎదుర్కొంది. కొన్నాళ్ళూ ఆగిపోయింది. ఆ తర్వాత శంకర్ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టి “భారతీయుడు 2” చిత్రాన్ని రెండు భాగాలుగా మార్చేశారు.
కాజల్, కమల్ హాసన్ కలిసి నటించిన సన్నివేశాలను మూడో భాగానికి తోసేశారు శంకర్. “భారతీయుడు 3” ఎప్పుడు విడుదలైనా తనకి మంచి హిట్ దక్కుతుందిలే అని కాజల్ సర్దుకొంది. కానీ “భారతీయుడు 2” ఘోరంగా పరాజయం కావడంతో ఇప్పుడు మొత్తం సీన్ తలకిందులు అయింది.
“”భారతీయుడు 3” చిత్రాన్ని ఇక థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటిటిలోనే విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. అంటే కాజల్ థియేటర్లో భారీ హిట్ అందుకోవాలన్న ఆమె ఆశ ఇప్పుడు నెరవేరనట్లే.
“ఆచార్య” సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడే కాజల్ పెళ్లి చేసుకొంది. పెళ్లి తర్వాత ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంది కానీ సినిమా లెంగ్త్ పెరిగింది అని దర్శకుడు కొరటాల శివ కాజల్ సీన్లు మొత్తం తీసేశారు. ఇక కొడుకు పుట్టిన తర్వాత ఆమె మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఈ కొత్త ఇన్నింగ్స్ లో ఆమె బాలయ్య సరసన “భగవంత్ కేసరి” సినిమాలో నటించింది. ఆ సినిమా ఆడింది. కానీ ఆమెకి దక్కిన పాత్ర చాలా చిన్నది.
![Kajal Aggarwal](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/10/kajal-aas2.jpg)
“సత్యభామ” అనే ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేస్తే అది ఆడలేదు. సో, కాజల్ కి పెళ్లి తర్వాత ఒక్క సరైన బ్లాక్ బస్టర్ లేదు. ఇప్పుడు “భారతీయుడు 3” థియేటర్లలోకి వచ్చేలా లేదు.