ఇలా వచ్చి తెరపై రొమాన్స్ చేసి అలా వెళ్లిపోయే హీరోయిన్లే ఎక్కువమంది. చాలా తక్కువమందికి మాత్రమే తమ టాలెంట్ చూపించే అవకాశం వస్తుంది. ఫరియా అబ్దుల్లాకు అలాంటి ఛాన్సే వచ్చింది.
“మత్తు వదలరా 2” సినిమాలో హీరోయిన్ గా నటించింది ఫరియా. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2-3 సీన్లు నటించి వెళ్లిపోయే పాత్ర కాదిది. సినిమాలో ఆమెది కీలక పాత్ర. 2 ఫైట్స్ కూడా ఉన్నాయి.
అయితే వీటితో పాటు ఇంకాస్త స్పెషల్ కూడా ఉందంటోంది ఫరియా. అదేంటంటే… “మత్తు వదలరా-2
సినిమా కోసం ఫరియా ఓ సాంగ్ రాసిందంట. రాయడమే కాదు, ఆ పాటను తనే ఆలపించింది. అంతేకాదు, తెరపై ఆ పాటకు తనే స్వయంగా కొరియోగ్రఫీ కూడా చేసింది.
సినిమాలో ఇదొక ర్యాప్ సాంగ్. ఓ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ కు ఇలాంటి అవకాశం రావడం నిజంగా చాలా పెద్ద విషయం. కాలభైరవ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. రితేష్ రానా డైరక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వస్తుంది. అంతకంటే ముందే, ప్రచారంలో భాగంగా ఫరియా అబ్దుల్లా సాంగ్ ను రిలీజ్ చేస్తారంట.