అందరు హీరోలకు సమదూరంలో ఉంటాడు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ప్రతి హీరోకు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు.. అదే టైమ్ లో తెరవెనక ప్రతి హీరోతో మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంటాడు. అందుకే దేవిశ్రీని అందరూ ఇష్టపడతారు.
అయితే తనకు తెలియకుండానే మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు దేవిశ్రీ. తాజాగా నిర్వహించిన కన్సర్ట్ వల్ల, సోషల్ మీడియాలో ఇతడు ట్రోలింగ్ కు గురికావాల్సి వచ్చింది.
గచ్చిబౌలిలో జరిగిన లైవ్ కన్సర్ట్ సూపర్ హిట్టయిందంటున్నారు చాలామంది. కేవలం పాటలకే పరిమితం కాకుండా, వివిధ సినిమాల్లోని థీమ్ మ్యూజిక్స్ ను ప్లే చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు దేవిశ్రీ.
అయితే ఈ కన్సర్ట్ లో మహేష్ సాంగ్స్, అతడి సినిమాల్లోని థీమ్ సాంగ్స్ కు పెద్దగా చోటివ్వలేదంట దేవిశ్రీప్రసాద్. ఇదే మహేష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. అందరు హీరోల సాంగ్స్ ను ఆలపించిన దేవిశ్రీ, మహేష్ పాటల్ని మాత్రం లైట్ తీసుకున్నాడట. పైగా మహేష్ నటించిన ఓ సినిమాలో థీమ్ మ్యూజిక్ ను మొదలుపెట్టి, సాంకేతిక కారణాల వల్ల మధ్యలోనే ఆపేశాడని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దేవిశ్రీపై విరుచుకుపడుతున్నారు మహేష్ ఫ్యాన్స్.