
కొన్ని పాత్రల నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఆ హీరో లేదా హీరోయిన్ ను చూసిన వెంటనే ఆ పాత్రలే గుర్తొస్తాయి. ‘డీజే టిల్లూ’గా సిద్ధు జొన్నలగడ్డ, ‘బేబీ’గా వైష్ణవి చైతన్య వేసిన ముద్రలు అలాంటివే.
ఆ ఇమేజ్ నుంచి బయటకొచ్చి మరో పాత్రను రక్తికట్టించడం సాధారణ విషయం కాదు. తాజాగా రిలీజైన జాక్ టీజర్ చూస్తే, ఫస్ట్ కలిగిన అభిప్రాయం ఇదే. టిల్లూ పాత్ర నుంచి బయటకొచ్చి కొత్త డైలాగ్ డెలివరీతో, తనలో జోష్ ను తానే కంట్రోల్ చేసుకున్నట్టు కనిపించాడు సిద్ధు జొన్నలగడ్డ.
దీనికితోడు రకరకాల డ్రెస్సుల్లో, మరీ ముఖ్యంగా బురఖాలో మహిళా గెటప్ లో కనిపించాడు సిద్ధు జొన్నలగడ్డ. అతడి డైలాగ్ డెలివరీ కూడా నెమ్మదిగా ఉంది. ఈ కొత్త మేనరిజమ్స్ లో అతడు ఎలా రాణిస్తాడో చూడాలి.
ఇక వైష్ణవి చైతన్య కూడా ఫక్తు కమర్షియల్ హీరోయిన్ పాత్రలో కనిపించినట్టు టీజర్ చూస్తే అర్థమౌతోంది. హీరో వెంట పడి, అతడ్ని ఇంప్రెస్ చేస్తూ, అతడి కోసం పరితపించే సగటు హీరోయిన్ రోల్ లా అనిపించింది.
బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నారు.