
దిల్ రాజు, హీరోయిన్ అంజలి మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. దిల్ రాజు తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో మంచి పాత్ర పోషించింది అంజలి. అలాగే దిల్ రాజు తన 50వ చిత్రం ‘గేమ్ ఛేంజర్’లో కూడా అంజలికి మంచి రోల్ ఆఫర్ చేశాడు. అందుకే, దిల్ రాజు నిర్మాణ సంస్థ తనకు హోమ్ బ్యానర్ లాంటిది అని చెప్తూ ఉంటుంది అంజలి.
తాజాగా దిల్ రాజుకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసింది అంజలి. అదే ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ రీ-రిలీజ్. తన కెరీర్ కు మంచి ఊపునిచ్చిన ఆ సినిమాను రీ-రిలీజ్ చేయమని దిల్ రాజును కోరింది అంజలి.
ఈ రిక్వెస్ట్ కు దిల్ రాజు కూడా సానుకూలంగా స్పందించాడు. తనకు కూడా ఆ సినిమాను రీ-రిలీజ్ చేయాలనే ఆలోచన ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని అంజలికి మాటిచ్చాడు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరిలో ఆ సినిమా మరోసారి థియేటర్లలోకి వస్తుందని చెబుతోంది అంజలి. ఆ సినిమా వచ్చి చాన్నాళ్లయింది, మరోసారి ప్రేక్షకుల మధ్య కూర్చొని ఆ సినిమాను ఎంజాయ్ చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది అంజలి. ఇప్పటికీ మహేష్ బాబును చిన్నోడు, వెంకటేష్ ను పెద్దోడు అని పిలుస్తుంటారు ప్రేక్షకులు. దీనికి కారణం ఈ సినిమానే.