ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలిస్తున్న కాలంలో జరిగినట్లుగానే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలిస్తున్న సమయంలో ఇండస్ట్రీ పెద్దలు సీఎంని కలవాల్సి వచ్చింది.
అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి ఒక సినిమా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శలు చేశారు. అప్పుడు జగన్ మోహన్ రెడ్డి థియేటర్ల టికెట్ రేట్లను దారుణంగా తగ్గించడంతో ఇండస్ట్రీ బెంబేలెత్తింది. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడు చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, తదితర హీరోలు వెళ్లి కలిశారు.
అప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల ఇండస్ట్రీ అంతా వెళ్లి సీఎం దగ్గరికి వెళ్లాల్సి వస్తే ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల మరోసారి ఇండస్ట్రీ పెద్దలు వెళ్లాల్సి వచ్చింది. అల్లు అర్జున్ ఒక ముఖ్యమంత్రి పేరు…అదీ కూడా తాను నివసిస్తున్న రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి పేరు మరవడం పెద్ద తప్పు.
అక్కడ మొదలైన గొడవ… సంధ్య థియేటర్ తొక్కిసలాటవైపు మళ్లీ అతని అరెస్ట్ వరకు వెళ్ళింది. అక్కడితో ఆగకుండా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగానికి జవాబుగా ప్రెస్ మీట్ పెట్టడంతో సమస్య జఠిలమైంది.
దాంతో, తప్పనిసరి పరిస్థితుల్లో కొత్తగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యతలు తీసుకున్న దిల్ రాజు చొరవ చూపి ఈ రోజు ఇండస్ట్రీ పెద్దలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేయించారు.
ఇలా అప్పుడు, ఇప్పుడూ మెగా హీరోల వల్లే ఇండస్ట్రీ ఇబ్బందులు పాలు అయింది. కాకపోతే, అప్పట్లో అల్లు అర్జున్, ఆయనికి ‘మామయ్య’ వరుసయ్యే ‘బాబాయి’ పవన్ కళ్యాణ్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు లేవు.