ఏడాది ముందుగానే విడుదల తేదీలు ప్రకటించుకుంటున్న రోజులివి. సినిమా వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి, ముందు విడుదల తేదీ ప్రకటించి కర్చీఫ్ వేసుకోవడం ముఖ్యం అన్నట్టు వ్యవహరిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ పట్టేశాయి. ఇప్పుడు అఖండ-2 వంతు.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో చిత్రం ‘అఖండ-2’. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు. సెప్టెంబర్ 25 రిలీజ్. ఆ తేదీకి స్ట్రయిట్ తెలుగులో పెద్ద సినిమాలతో పోటీ లేదు కానీ, ‘కాంతార-2’ అనే పాన్ ఇండియా సినిమాతో మాత్రం అఖండ పోటీపడాల్సి ఉంది.
‘కాంతార ఛాప్టర్ 1’ (కాంతార 2 గా కొంతమంది పిలుస్తున్నారు) విడుదల తేదీని చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు.
‘కాంతార’ దేశవ్యాప్తంగా హిట్టయింది. దానికి ప్రీక్వెల్ గా తెరకెక్కుతోన్న ‘కాంతార ఛాప్టర్ 1’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటు తెలుగునాట ‘అఖండ-2’పై కూడా భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే, బోయపాటి-బాలయ్య కాంబో ఇప్పటివరకు ఫెయిల్ అవ్వలేదు. కలిసి హ్యాట్రిక్ కొట్టారు వీళ్లు.
సో.. వారం రోజుల గ్యాప్ లో వస్తున్న ‘అఖండ-2’, ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాల్లో ఏది నెగ్గుతుందో చూడాలి.