అంతా ఓకే అయింది. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఇక క్లాప్ కొట్టడమే తరువాయి. అంతలోనే అకస్మాత్తుగా ఆగిపోయింది నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా. దీంతో నందమూరి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ మోక్షు-ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయినట్టు మీడియాలో కథనాలు కూడా వచ్చేశాయి. అటు బాలకృష్ణ మాత్రం మోక్షుకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే ఓపెనింగ్ ఆపామని, త్వరలోనే ఉంటుందని చెబుతున్నారు.
ఇంతకీ వీటిలో ఏది నిజం? మీడియా చెబుతున్నట్టు మోక్షు సినిమా ఆగిపోయిందా లేక మేకర్స్ ఈ ప్రాజెక్టును రద్దు చేసుకున్నారా?
మోక్షజ్ఞకి ఆరోగ్యం వల్లే ఆగిందని ఒక మాట వినిపిస్తున్నా ప్రశాంత్ వర్మ విషయంలో బాలయ్య ఎదో ఫీల్ అయినట్లు కనిపిస్తోంది అని మరో మాట వినిపిస్తోంది. ఇందులో ఏది నిజమో తెలియదు. ఇంతకుముందు దూకుడుగా సోషల్ మీడియాలో డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా ఎదో ఒకటి పోస్ట్ చేసి కలకలం రేపేవాడు ప్రశాంత్ వర్మ. కానీ ఈ సినిమా ఆగిపోయింది అని మీడియా పుంఖానుపుంఖాలుగా రాస్తున్నా మౌనం వహిస్తున్నాడు.
ఇప్పటికే రణ్వీర్ సింగ్ తో ఒక సినిమా రద్దు కావడం, మోక్షజ్ఞ సినిమా పూజ జరగాల్సిన ఒక రోజు ముందు క్యాన్సిల్ కావడంతో ప్రశాంత్ వర్మ కొంచెం షాక్ లో ఉన్నట్లు టాక్.
అటు వైపు నుంచి అయినా ఇటువైపు నుంచి అయినా ఒక అధికారక ప్రకటన వచ్చేంతవరకు ఈ ఊహాగానాలు తప్పవు.