
హీరోలలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యేది మంచు విష్ణు. అతని మాటలు, చేష్టలు అన్నీ మీమర్స్ తెగ వాడేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో మంచు విష్ణుకున్న క్రేజ్ వేరు… అదేనండి ట్రోలింగ్ విషయంలో.
ఐతే, విష్ణు మాత్రం తాను వాటిని ఇప్పుడు పట్టించుకోను అని చెప్తున్నారు. “నేను ఎలా మాట్లాడినా అందులో కొన్ని క్లిప్స్ తీసుకొని వేరే అర్థం వచ్చేలా పోస్ట్ చేస్తున్నారు. కానీ జనాలకు అర్థం అయింది. నేను చెప్తున్నది వేరు, వీళ్లు రీల్స్ గా మార్చి చేస్తున్న ట్రోల్స్ వేరు అని జనం అర్థం చేసుకుంటున్నారు,” అని విష్ణు చెప్తున్నారు.
“కన్నప్ప” సినిమాతో మన ముందుకు రానున్నాడు మంచు విష్ణు. “ఈ సినిమా విషయంలో ఎవరైనా ట్రోల్ చేసినా, సినిమాని కించపర్చేలా ప్రవర్తించినా వాళ్ళు మటాష్ అయిపోతారు,” నటుడు రఘుబాబు అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో విష్ణుతో పాల్గొన్న రఘుబాబు … “కన్నప్ప” విషయంలో ట్రోలింగ్ కి దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. “లేదంటే మీ ఖర్మ… శివుడు ఆగ్రహానికి గురవుతారు. శివుడికి కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. మిగతా సినిమాల గురించి ఏమైనా చేసుకోండి కన్నప్పకి ట్రోలింగ్ చెయ్యకండి,” అని రఘుబాబు అన్నారు.
ఈ సినిమాలో విష్ణు హీరోగా కాగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి పెద్ద నటులు కీలక పాత్రల్లో మెరుస్తారు.