వాణి కపూర్ బాలీవుడ్ లో సీనియర్ నటి అని చెప్పొచ్చు. 35 ఏళ్ల ఈ సుందరి బాలీవుడ్ లో 2013లో అడుగుపెట్టింది. 2014లో “ఆహా కళ్యాణం”తో తెలుగులో కూడా అడుగుపెట్టింది. హీరోయిన్ గా దశాబ్ద కాలంగా నటిస్తోన్న ఇంకా క్రేజ్ రాలేదు. ఆమె తర్వాత అడుగుపెట్టిన భామలు ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు.
ఐతే, ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్లకు అవకాశాలు రావడానికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ ముఖ్యం అవుతోందని ఈ భామ ఈసడించుకుంటోంది. జాన్వీ కపూర్, దిశా పటాని వంటి భామలకు అందుకే అవకాశాలు వస్తున్నాయట. వాణి కపూర్ ఈ మాట చెప్పింది.
డైరెక్ట్ గా వారి పేర్లు తీయకున్నా ఆ అర్థం వచ్చేలా మాట్లాడింది. కొందరు హీరోయిన్లకు ఒక్క థియేట్రికల్ హిట్ లేదు కానీ వాళ్లకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఎందుకని ఆరా తీస్తే వాళ్లకు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు అని సమాధానం దొరికింది అని చెప్తోంది.
జాన్వీ కపూర్ ఇప్పటివరకు ఏడో, ఎనిమిది హిందీ సినిమాల్లో నటించింది. అందులో సగం మాత్రమే థియేటర్ లలో విడుదల అయ్యాయి. అవన్నీ అపజయాలే. మిగతావి డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల అయ్యాయి. అయినా అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లో ఆమెకి క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. జాన్వీకి దాదాపు పాతిక మిలియన్ల (2.5 కోట్ల) ఫాలోవర్స్ ఉన్నారు ఇన్ స్టాగ్రామ్ లో. అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉందన్నమాట. అందుకే ఆమెకి అలా ఆఫర్లు వస్తున్నాయి.
దిశా పటాని పరిస్థితి కూడా అంతే. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రాలేవీ ఇటీవల విజయం సాధించలేదు. కానీ ఆమెకి పెద్ద ఆఫర్లు ఉన్నాయి. ఇక దిశకి ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న క్రేజ్ ఓ రేంజ్. ఆమెకి ఏకంగా 61 మిలియన్ల (6 కోట్ల) ఫాలోవర్స్ ఉన్నారు. ఈ నంబర్స్ చూసే వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి అనేది వాణి కపూర్ ఆరోపణ.