
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు కోర్టులో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇది ఆ కోర్టు కాదు. ‘కోర్టు’ అనే సినిమాలో జానీ మాస్టర్ కేసును ప్రస్తావించారా అనేది చర్చ. ఈ అనుమానం రావడానికి ఓ కారణం ఉంది.
ప్రియదర్శి హీరోగా కొత్త దర్శకుడితో తెరకెక్కిన చిత్రం ‘కోర్టు’. వాల్ పోస్టర్ మూవీస్ బ్యానర్ పై హీరో నాని ఈ సినిమాను నిర్మించాడు. పోక్సో చట్టం, దాని పర్యవసానాల చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.
సరిగ్గా ఇక్కడే జానీ మాస్టర్ కేసు తెరపైకొచ్చింది. జానీ మాస్టర్ పై నమోదైన కేసు కూడా పోక్సో చట్టానికి సంబంధించినదే. తను మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ శ్రేష్ఠి వర్మ అనే మహిళా కొరియోగ్రాఫర్ అతడిపై కేసు పెట్టింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్ ను పోక్సో చట్టం కింద అతడ్ని అరెస్ట్ చేశారు.
ఇప్పుడీ కేసును ‘కోర్టు’ సినిమాలో చర్చించారేమోనని కొందరి అనుమానం. అలాంటి డౌట్స్ అక్కర్లేదని క్లారిటీ ఇచ్చాడు నాని. తమ సినిమాలో పోక్సో చట్టం గురించి చర్చించామని, అయితే జానీ మాస్టర్ కేసుకు తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు.
“ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. వెరీ బ్యూటీఫుల్ ఫిల్మ్. ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను. నాలోని కాన్ఫిడెన్స్ చూసి మీరే డిసైడ్ అవ్వండి. ఇందులో ఎవరు హీరో అని చెప్పడం కష్టం. ఈ కథ చాలా సెన్సిటివ్ మేటర్. చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాం. జగదీశ్ చాలా రీసెర్చ్ చేశారు. సినిమా పూర్తయినప్పటికీ నిలబడి క్లాప్స్ కొడతారు. ఇది నా గ్యారెంటీ,” అన్నారు నాని.