
హీరోహీరోయిన్లు కూడా మనుషులే. వాళ్లకూ ఆరోగ్య సమస్యలుంటాయి. అయితే కొందరు పైకి చెప్పుకుంటారు, మరికొందరు మాత్రం చెప్పుకోరు. సీక్రెట్ గా విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని వస్తుంటారు. సందీప్ కిషన్ మాత్రం అంతా ఓపెన్.
తన ఆరోగ్య సమస్యను తానే బయటపెట్టాడు సందీప్ కిషన్. ఈ హీరోకు తీవ్రమైన సైనస్ సమస్య ఉందట. దాని వల్ల మెడ-తల చుట్టూ విపరీతమైన పెయిన్ వస్తుందని చెప్పుకొచ్చాడు. అది మందులతో పోయేది కాదంట. కచ్చితంగా సర్జరీ చేయాల్సిందేనంట.
ఈ సమస్య వల్ల ఒక్కోసారి తను చిరాగ్గా ఉంటానని, ఆ టైమ్ లో తనను చూసిన వాళ్లు సహచర నటీనటులు, టెక్నీషియన్స్ తో సరిగ్గా ఉండనంటూ ప్రచారం చేశారని చెప్పుకొచ్చాడు. షాట్ గ్యాప్ లో కారవాన్ లోకి వెళ్లిపోతాడని, ఎవ్వరితో కలవడనే రూమర్స్ కూడా ఉన్నాయి. వీటికి కూడా కారణం సైనస్ అని, కారవాన్ లోకి వెళ్లి ఓ అరగంట పడుకుంటే రిలాక్స్ గా ఉంటుందని చెబుతున్నాడు.
సర్జరీ అంటే తనకు భయమని, పైగా ఇన్నాళ్లూ బిజీగా ఉండడం వల్ల సర్జరీ గురించి ఆలోచించలేదని అన్నాడు. “మజాకా” సినిమా రిలీజ్ తర్వాత తన ఆరోగ్యంపై దృష్టిపెడతానంటున్నాడు ఈ హీరో.