![Rajinikanth and Suriya](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/10/rajinikanth-suriya.jpg)
సూర్య కేవలం హీరో మాత్రమే కాదు, మంచి నటుడు కూడా. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితమైపోడు. ‘ఆకాశం నీ హద్దురా’ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు కూడా చేస్తుంటాడు. ఈ బ్యాలెన్స్ అతడికి ఎలా వచ్చింది.
దీని వెనక అసలు విషయాన్ని బయటపెట్టాడు సూర్య. అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట రజనీకాంత్ తనకు ఇచ్చిన ఓ సలహా వల్ల తన కెరీర్ మొత్తం మారిపోయిందంటున్నాడు.
“ఓసారి విమానంలో నేను, రజనీకాంత్ కలిసి వెళ్తున్నాం. అప్పుడు ఆయన ఓ మాట చెప్పారు. నువ్వు ఓ హీరో, అదే టైమ్ లో నటుడివి కూడా. రెండూ బ్యాలెన్స్ చేయమన్నారు. హీరోగా ఎన్ని యాక్షన్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేసినా నటుడిగా నీకంటూ తృప్తి ఉండేలా చూసుకోమన్నారు. దాదాపు 20 ఏళ్ల కిందట ఆయన నాకు ఈ మాట చెప్పారు. అప్పట్నుంచి అది నా మైండ్ లో అలా ఉండిపోయింది. అందుకే ‘సింగం’ లాంటి సినిమాలు చేస్తాను, అదే టైమ్ లో ‘జై భీమ్’ లాంటి సినిమాలు కూడా చేస్తాను.”
ఇప్పటికీ, ఎప్పటికీ ఇండియాలో సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ మాత్రమే అంటున్నాడు సూర్య. ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయిన ఆ బిరుదును మరో హీరో దక్కించుకోలేడని అన్నాడు.