
అవతార్ సినిమాని మొదట నాతోనే తీయాలనుకున్నారు అని ఆ మధ్య బాలీవుడ్ ఒకప్పటి హీరో గోవిందా ప్రకటించి సంచలనం సృష్టించారు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నా వెంట పడ్డాడు చాలా రోజులు అని కూడా గోవిందా తెలిపారట. అయితే, అలా మేకప్ వేసుకొని వేరే మానవుల్లా నటించాలంటే తనకు ఇష్టం కలగలేదని, అందుకే జేమ్స్ కామెరూన్ కి నో చెప్పినట్లు గోవిందా అప్పట్లో వివరించాడు.
గోవిందా మాటలు నమ్మశక్యంగా లేవు అని అప్పట్లోనే అందరూ భావించారు.
ఇప్పుడు ఆయన భార్య సునీత స్పందించారు. “అవతార్ లేదు, గివతార్ లేదు. నాకు తెలిసినంతవరకు జేమ్స్ కామెరూన్ కానీ, ఆయన టీం కానీ మా ఆయనకి ఫోన్ చెయ్యలేదు. కలవలేదు. ఆయనవి అన్ని ఉతుత్తి మాటలు,” అని సునీత పేర్కొన్నారు.
అలాగే, ఒక యువ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని గోవిందా తన భార్య సునీతకి విడాకులు ఇవ్వబోతున్నట్లు ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. “ఆయన ఎక్కడికి పోడు. నేను ఎక్కడికీ వెళ్ళను. ఆయనకి నన్ను వదిలి వెళ్లేంత సీన్ లేదు,” అని చెప్పింది సునీత. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాను, అబద్దాలు చెప్పను అని సునీత చెప్పడం విశేషం.