కార్తీ కెరీర్ లోనే సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా “సర్దార్.” ఈ సినిమాలో అతడు తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. సినిమా హిట్టవ్వడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. అందుకే సీక్వెల్ ప్రకటించారు.
‘సర్దార్ 2’ లాంఛనంగా మొదలైంది. ఈ సినిమా కోసం చెన్నైలో భారీ సెట్స్ వేస్తున్నారు. సోమవారం నుంచి ఆ సెట్ లోనే షూటింగ్ మొదలుకాబోతోంది.
సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర పోషించిన కార్తీకి, రా (RAW) నుంచి పిలుపొస్తుంది. కాంబోడియాలో అతడికి తొలి టాస్క్ ఇస్తారు. ఇక్కడ్నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. సర్దార్ క్లయిమాక్స్ లో తండ్రి పాత్ర ఉన్నట్టుండి సెడన్ గా మాయమౌతుంది. అతడు ఎటు వెళ్లాడు, సీక్వెల్ లో ఎలా ఎంట్రీ ఇస్తాడనేది ఆసక్తికరం.
యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మొదటి సినిమా తరహాలోనే, సీక్వెల్ ను కూడా యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మిత్రన్.