
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పెద్ద హిట్టయింది. భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అక్కడ కూడా హిట్టయింది. తర్వాత టీవీల్లోకొచ్చి అక్కడ కూడా హిట్టయింది. ఇలా ఆ సినిమా రన్ అన్ని విభాగాల్లో ముగిసినప్పటికీ, కోర్టులో మాత్రం మొన్నటివరకు ఈ సినిమాపై పెట్టిన కేసు నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు అది కూడా క్లియర్ అయింది.
ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచారు. లెక్కప్రకారం, భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు ఇస్తారు. ఈ సినిమాకు భారీబడ్జెట్ ఖర్చవ్వలేదని, కాబట్టి టికెట్ రేట్ల పెంపు నిర్ణయం సమంజసం కాదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
ఈ సినిమా బడ్జెట్ పై ఈడీతో దర్యాప్తు చేయించాలంటూ లక్ష్మణ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇది కోర్టు పరిధిలోకి రాదని, అధికారుల్ని సంప్రదించాలని పిటిషనర్ కు సూచించింది. పైగా ఈ కేసు దాఖలు చేయడం వెనక ప్రజోపయోగం కంటే, సొంత ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశం కనిపిస్తోదంటూ అనుమానం కూడా వ్యక్తం చేసింది.
మరీ ముఖ్యంగా సినిమాకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా గురించి విచారించడం అనవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ సినిమా రిలీజైన టైమ్ లోనే ఆదాయపు పన్నుశాఖ అధికారులు, దిల్ రాజు నివాసాలు, ఆస్తులు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఇదే విషయాన్ని దిల్ రాజు తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.