స్పీడ్ గా స్టార్డం తెచ్చుకొని ఎడాపెడా సినిమాలు చెయ్యడం… అంతే స్పీడ్ గా సినిమాలు తగ్గిపోయి బేజారు అవడం ఇటీవల ఇద్దరి హీరోయిన్ల విషయంలో జరిగింది.
శ్రీలీల
రాఘవేంద్రరావు తీసిన “పెళ్లి సందD” చిత్రంతో పరిచయమైన అచ్చ తెలుగు సుందరి శ్రీలీల. బెంగుళూరులో పుట్టి పెరిగిన శ్రీలీల డ్యాన్స్ అదరగొడుతుంది. అందుకే, “పెళ్లి సందD”లో నటించిన హీరో రోషన్ కెరీర్ ఎదగలేదు కానీ ఈ భామ రెండేళ్లలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది.
ఆ తర్వాత వచ్చిన “ధమాకా” హిట్ కావడంతో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ పోతినేని, నితిన్ ఇలా పెద్ద, మిడిల్ రేంజ్ హీరోల సరసన సినిమాలు వచ్చి పడ్డాయి. “ధమాకా” 2022 డిసెంబర్లో విడుదలైతే 2024 జనవరి అంటే 13 నెలల్లో ఐదు సినిమాలు విడుదల చెయ్యగలిగింది. “స్కంద”, “భగవంత్ కేసరి”, “ఆదికేశవ”, “ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్”, “గుంటూరు కారం” సినిమాలు విడుదల అయ్యాయి. అందులో బాలయ్యకి కూతురిలాంటి పాత్ర పోషించిన “భగవంత్ కేసరి” ఒక్కటే విజయం సాధించింది. “గుంటూరు కారం” మోస్తరుగానే ఆడింది. మిగతావన్నీ ఫ్లాపులే.
ఇప్పుడు కొత్తగా ఇంకా సినిమాలు సైన్ చెయ్యలేదు. ఇంతకుముందు ఒప్పుకున్నా “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా మాత్రమే ఉంది లైన్లో.
మొన్నటివరకు సగం సినిమా ఇండస్ట్రీ ఆమె గుప్పిట్లో ఉండింది. ఇప్పుడు మొత్తం పడిపోయింది.
కృతి శెట్టి
“ఉప్పెన” సినిమాతో యమా క్రేజ్ పొందింది. ఆ వెంటనే రామ్, నితిన్, నాని, నాగ చైతన్య వంటి యువ హీరోల సరసన ఆఫర్లు పొందింది.
నానితో నటించిన “శ్యామ్ సింగరాయ్” విజయం సాధించింది. అలాగే నాగచైతన్యతో నటించిన “బంగార్రాజు” కూడా ఆడింది. కానీ ఆ తర్వాత రామ్ తో చేసిన “వారియర్”, నితిన్ తో నటించిన “మాచర్ల నియోజకవర్గం”, చైతన్యతో రెండో సారి నటించిన “కస్టడీ”, అలాగే సుధీర్ బాబు సరసన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” వంటి చిత్రాలు బోల్తా కొట్టాయి. దాంతో ఆమె కెరీర్ రివర్స్ గేర్ లో పడింది.
ప్రస్తుతం ఆమె చేతిలో శర్వానంద్ హీరోగా రూపొందిన “మనమే” అనే మూవీ ఉంది. ఇది హిట్ అయితేనే ఆమెకి తెలుగులో మరో ఆఫర్ వస్తుంది.