
హీరోయిన్లు నిర్మాతలుగా మారడం కొత్తేమి కాదు. సావిత్రి కాలం నుంచే ఉన్నది ఆ ట్రెండ్. కానీ చాలామంది అగ్ర కథానాయికలు నిర్మాతలుగా మారి చేతులు కాల్చుకున్నారు. ఎంతో నష్టపోయారు. నిర్మాణం గురించి అవగహన లేకపోవడం, విపరీతంగా ఖర్చు పెట్టడం, నమ్మి బాధ్యతలు అప్పచెప్పితే వాళ్ళు మోసం చెయ్యడం వంటి కారణాల వల్ల సావిత్రి, జయసుధ, సౌందర్య.. ఇలా ఎందరో నష్టపోయారు.
తాజాగా సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఐతే, ఆమె తాను ఎంతో తెలివైంది అని ప్రూవ్ చేసుకొంది.
మొదటి సినిమా ప్రయత్నంగా ఆమె “శుభం” అనే సినిమా నిర్మించింది. ఈ సినిమాలో సమంత కొంత పెట్టుబడి పెట్టింది. మిగతా వేరే వాళ్ళు పెట్టారు. నిర్మాణ బాధ్యతలు వేరే వాళ్ళు చూసుకున్నారు.
తనకున్న పరిచయాలు, స్టార్డం ఉపయోగించి ఓటిటి డీల్, శాటిలైట్ కుదిరింది. జీ గ్రూప్ కి ముందే అమ్మేసింది సమంత. పెట్టిన పెట్టుబడి పోగా మంచి లాభాలు ఆ డీల్ తో వచ్చింది. ఇక థియేటర్లో విడుదల చేస్తే ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే మంచి మొత్తమే. అమెరికాలో కూడా బ్రేక్ ఈవెన్ కి వచ్చేలా ఉంది.
మొత్తంగా చూస్తే మొదటి సినిమాని ఆమె “సేఫ్”గా సక్సెస్ చేసింది. హిట్ అనడం కన్నా సమంతకి లాభాలు ఐతే తెచ్చిపెట్టింది. కొన్నవాళ్లకు కూడా నష్టం లేదు. ఇక సినిమాకి ప్రశంసలు దక్కాయి. మంచి రివ్యూస్ వచ్చాయి. ఓవరాల్ గా నిర్మాతగా సమంత సక్సెస్.