
సల్మాన్ ఖాన్ తో భారీ చిత్రం అని మొన్నటివరకు హడావిడి చేశాడు దర్శకుడు అట్లీ. తనతో సినిమా ప్లాన్ చేస్తున్నాడనే కారణంతో అడగ్గానే అట్లీ నిర్మించిన “బేబీ జాన్” చిత్రంలో గెస్ట్ రోల్ చేశాడు. కానీ తీరా ఇప్పుడు బడ్జెట్ వర్కవుట్ కాదని సల్మాన్ ఖాన్ సినిమాని వదిలి అల్లు అర్జున్ తో చేస్తున్నాడు.
ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ సల్మాన్ ఖాన్ తో వర్కవుట్ కాదని, అదే అల్లు అర్జున్ తో తీస్తే ఆ బడ్జెట్ సాధ్యమే అని భావిస్తున్నాడు అట్లీ. “పుష్ప 2″తో అల్లు అర్జున్ కి హిందీ మార్కెట్ బాగా పెరగడం, సల్మాన్ ఖాన్ కి ఇటీవల సరైన భారీ హిట్స్ లేకపోవడంతో అట్లీ అలా బడ్జెట్ పేరు చెప్పి తప్పుకున్నాడు.
ఐతే, సల్మాన్ ఖాన్ ని అట్లీ అవమానించాడు అని ఆయన అభిమానులు అంటున్నారు. సల్మాన్ ఖాన్ తో బడ్జెట్ వర్కవుట్ కాదని చెప్పి తప్పుకోవడం అంటే మా హీరో రేంజ్ తక్కువ అని ఇండైరెక్ట్ గా చెప్పడమే కదా అనేది వారి వాదన.
సల్మాన్ ఖాన్ తో సినిమా అనుకున్నప్పుడు అట్లీకి తెలీదా తాను అనుకునే కథకు తగ్గ బడ్జెట్, మార్కెట్ సల్మాన్ తో వర్కవుట్ అవుతుందో లేదో అని అని అడుగుతున్నారు. ఈ ట్రోలింగ్ తట్టుకోలేక అట్లీ ఇప్పుడు కొత్త వివరణ ఇచ్చాడు.
సల్మాన్ ఖాన్ తో సినిమా ఆగిపోలేదు కేవలం వాయిదా పడింది అని చెప్తున్నాడు. “ఈ సినిమాలో మరో హీరోగా రజినీకాంత్ ని అడిగాం. సల్మాన్ ఖాన్ తండ్రి పాత్రకు రజినీకాంత్ ఒప్పుకున్నారు. కానీ ఆయన డేట్స్ ఇప్పుడు అందుబాటులో లేవు. అందుకే, సినిమా వాయిదా పడింది,” అని అట్లీ వర్గాలు క్లారిఫికేషన్ ఇచ్చాయి.