పవన్ కల్యాణ్ అంటే సాయిధరమ్ తేజ్ కు ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తనకు మేనమామ మాత్రమే కాదు, గురువు-మార్గదర్శి కూడా అని చెబుతుంటాడు సాయితేజ్. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు సాయితేజ్ రియాక్షన్ అందరం చూశాం. పవన్ ను కౌగిలించుకోవడంతో పాటు, అతడ్ని అమాంతం ఎత్తేశాడు.
ఇక చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు సాయితేజ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. విజిల్స్ తో రచ్చరచ్చ చేశాడు. చివరికి చిరంజీవి ఆగమని చెప్పాల్సి వచ్చింది. పవన్ అంటే సాయితేజ్ కు అంతిష్టం.
ఇప్పుడు పవన్ పై సాయితేజ్ కు ఉన్న ప్రేమలో మరో కోణం బయటపడింది. తిరుమలలో ప్రత్యక్షమయ్యాడు సాయిధరమ్ తేజ్. కాలి నడకన మెట్లు ఎక్కి తిరుమల చేరుకున్నాడు. తన మేనమామ ఎన్నికల్లో గెలిస్తే మెట్లు ఎక్కి కొండకొస్తానని మొక్కుకున్నాడట ఈ హీరో. పవన్ గెలవడంతో కాలినడకన తిరుమల చేరుకొని మొక్కు చెల్లించుకున్నాడు.
పవన్ తో కలిసి బ్రో సినిమాలో నటించాడు సాయితేజ్. ఇప్పటికీ సమయం కుదిరితే తను చేయబోయే సినిమా కథల్ని పవన్ కు వినిపించి, అభిప్రాయాలు తీసుకుంటాడు. కేవలం పవన్ పై ఇష్టంతోనే అల్లు అర్జున్ ను అతడు సోషల్ మీడియాలో అన్-ఫాలో చేశాడనే ప్రచారం కూడా ఉంది.