
సాధారణంగా సొంత ప్రాంతానికి వెళ్తే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ వేరు. రష్మిక మాత్రం భయపడుతోంది. బెంగళూరులో అడుగుపెట్టడానికి ఆమె ఇబ్బంది పడుతోంది. ఇదంతా స్వయంగా ఆమె చేసుకున్నదే.
మొన్నటికిమొన్న తనది హైదరాబాద్ అని చెప్పుకుంది. టాలీవుడ్ తోనే తను స్టార్ గా ఎదిగాననే అర్థంవచ్చేలా మాట్లాడింది. అది నిజమే కానీ, కన్నడ ప్రేక్షకులకు మాత్రం రుచించలేదు. శాండిల్ వుడ్ లో ఎంట్రీ ఇచ్చి, హైదరాబాద్ నుంచి వచ్చానని, ముంబయి మీడియాతో చెప్పడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు.
అదే టైమ్ లో రొమాంటిక్ సాంగ్స్ ఎక్కువగా బాలీవుడ్ నుంచి మాత్రమే వస్తాయనే అర్థం వచ్చేలా మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈసారి కన్నడిగులతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా భగ్గుమన్నారు.
ఇప్పుడు ఏకంగా ఓ కన్నడ ఎమ్మెల్యే రష్మికపై బాహాటంగా విమర్శలు చేశాడు. రష్మికకు గుణపాఠం చెప్పాలంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరుకావాలంటూ ఆహ్వానిస్తే కుదరదని చెప్పిందంట రష్మిక. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఖాళీ లేదందంట.

దీంతో సదరు ఎమ్మెల్యేకు కాలింది. రష్మికపై ఆయన అగ్గిమీద గుగ్గిలమౌతున్నాడు. ఈ సినిమా వాళ్లందరికీ బోల్టులు బిగించాలని, నట్టులు సెట్ చేయాలంటూ స్వయంగా కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో.. ఈ వివాదం మరింత ముదిరింది. ఇలాంటి టైమ్ లో రష్మిక బెంగళూరులో అడుగుపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో?