ఈ ఏడాది ప్రారంభంలో ‘జై హనుమాన్’ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి, ఇందులో నటీనటుల ఎంపికపై స్పెక్యులేషన్ నడుస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా హనుమంతుడి పాత్రను ఎవరు పోషిస్తారనే చర్చ జోరుగా సాగింది. తాజాగా దీనికి ఫుల్ స్టాప్ పడింది.
‘జై హనుమాన్’ లో ప్రధాన పాత్రధారిగా రిషబ్ శెట్టిని తీసుకున్నారు. సినిమాను అధికారికంగా ప్రకటించడంతో పాటు రిషబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘జై హనుమాన్’ థీమ్ మ్యూజిక్ ను కూడా బయటపెట్టారు.
ఇప్పుడీ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకెక్కింది. దీనికి కారణం దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో ఫొటో రిలీజ్ చేయడమే. ఇటు ప్రశాంత్ వర్మ, అటు రిషబ్ శెట్టి, మధ్యలో రానా.. ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ ఫొటో పోస్ట్ చేసి జైజై హనుమాన్ అంటూ క్యాప్షన్ తగిలించాడు దర్శకుడు.
దీంతో ఈ ప్రాజెక్టులోకి రానా వచ్చాడనేది ఫిక్స్ అయింది. అయితే అతడు ఏ పాత్ర పోషించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో విలన్ గా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. కాబట్టి ‘జై హనుమాన్’ లో అతడికి రావణుడి పాత్రను కట్టబెట్టే అవకాశం ఉందంటూ ప్రచారం నడుస్తోంది. మరికొందరు మాత్రం ఫిక్షన్ కథ కాబట్టి, రెగ్యులర్ విలన్ పాత్రే అయి ఉండొచ్చని అంటున్నారు.