
బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీ కూడా ఓ లిస్ట్ తయారుచేసింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చనే అనుమానంతో తను కూడా 29 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
ఈ మేరకు కొందరికి నోటీసులిచ్చింది. ముందుగా దగ్గుబాటి రానాతో విచారణను మొదలుపెట్టాలనుకుంది. కానీ తొలి నోటీసుకే విముఖత ఎదురైంది. తను విచారణకు రాలేనని, మరింత సమయం కావాలని దగ్గుబాటి రానా కబురు పంపించాడు.
నోటీసులిచ్చిన తర్వాత, ఇలా ఒకసారి తిరస్కరించే హక్కు ఎవరికైనా ఉంటుంది. రానా కూడా ఆ వెసులుబాటును వినియోగించుకున్నాడు. మరో నోటీసు వస్తే మాత్రం ఆయన తప్పనిసరిగా ఎంక్వయిరీకి రావాల్సి ఉంటుంది.
బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేసిన వాళ్లలో రానా కూడా ఉన్నాడు. అయితే దానిపై అతడు ఇదివరకే వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ ఈడీ మాత్రం వదల్లేదు. విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి లాంటి నటీనటులకు కూడా నోటీసులు వెళ్లాయి.















