
‘పుష్ప-2’ యూనిట్ చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించింది. ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించి, దేశవ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఒకేసారి రెండు అస్త్రాలు ప్రయోగించింది.
ఓవైపు అదనపు సన్నివేశాలు జత చేస్తూనే, మరోవైపు గణనీయంగా టికెట్ రేట్లు తగ్గించింది. రేపట్నుంచే ఈ రెండూ అమల్లోకి రాబోతున్నాయి. ఈ ఎత్తుగడ సినిమాకు మరోసారి ఆక్యుపెన్సీ తెచ్చిపెడుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
‘పుష్ప-2’ సినిమా 3 గంటల 20 నిమిషాలుంది. దీనికి అదనంగా రేపట్నుంచి మరో 20 నిమిషాలు యాడ్ చేయబోతున్నారు. సో.. రేపట్నుంచి పుష్ప-2 సినిమా చూడాలంటే థియేటర్ లోనే ఇంటర్వెల్ తో కలిపి ఏకబిగిన 4 గంటల సమయం గడపాల్సి ఉంటుంది.
ఇక టికెట్ రేట్ల విషయానికొస్తే.. నైజాంలో ఈ సినిమాకు భారీగా టికెట్ రేట్లు తగ్గించారు. సింగిల్ స్క్రీన్స్ లో 112 రూపాయలకు, మల్టీప్లెక్సుల్లో కేవలం 150 రూపాయలకే ‘పుష్ప-2’ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. దీనికి కాస్త అదనంగా టాక్సులు పడే అవకాశం ఉంది.