“డబుల్ ఇస్మార్ట్” విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా చుట్టూ ఎన్నో అనుమానాలున్నాయి, కొన్ని భయాలు కూడా ఉన్నాయి. అయితే ఓ సెక్షన్ మీడియాలో చెప్పుకుంటున్న ఆ భయాలేవీ తనకు లేవంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకే ఒక్క విషయంలో మాత్రం తను భయపడినట్టు వెల్లడించాడు.
“డబుల్ ఇస్మార్ట్ కోసం సంజయ్ దత్ ను తీసుకోవాలని అనుకున్నాం. ఆయనకు వెళ్లి కథ వినిపించాం. ఆయనకు నచ్చింది. కానీ కాల్షీట్లు లేవన్నాడు. ఎందుకంటే, అప్పటికే ఆయన 7 సినిమాలకు ఓకే చెప్పారు. అలాంటి టైమ్ లో మాకు కాల్షీట్లు దొరకడం చాలా కష్టం. సంజూ బాబా కాల్షీట్ దొరుకుతుందా దొరకదా అనే భయంతోనే షూటింగ్ మొదలుపెట్టాం.”
ఇలా సినిమా మొత్తం ఈ ఒక్క భయంతోనే గడిచిపోయిందని వెల్లడించాడు పూరి జగన్నాథ్. బహుశా.. అందుకేనేమో.. సంజయ్ దత్ సెట్స్ పైకి వచ్చిన తొలి షెడ్యూల్ లోనే రామ్-సంజయ్ దత్ మధ్య కీలకమైన క్లయిమాక్స్ పార్ట్ షూటింగ్ ను పూర్తిచేశారు.
ఆ తర్వాత సంజయ్ దత్ కాల్షీట్లు, రామ్ అందుబాటులో ఉన్న రోజుల్ని మ్యాచ్ చేసుకొని మిగతా సీన్స్ పూర్తిచేసినట్టు వెల్లడించాడు పూరి జగన్నాథ్. ఆగస్ట్ 15న థియేటర్లలోకి వస్తోంది “డబుల్ ఇస్మార్ట్”.