ఓ భారీ చిత్రానికి ముందు, అదే హీరో నటించిన ఫ్లాప్ సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే విడ్డూరంగా ఉంది కదా. కానీ ప్రాక్టికల్ గా ఇది జరగబోతోంది. పైగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో విషయంలో ఇలా జరుగుతోంది.
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ వరల్డ్ సినిమా “కల్కి” ఈనెల 27న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దీని కోసం అతడి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది. సినిమాపై ఆ రేంజ్ లో అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని అంతకంతకు పెంచేలా సినిమా ప్రమోషన్ జరుగుతోంది.
ఓవైపు ఇదిలా నడుస్తుండగా… మరోవైపు ప్రభాస్ నటించిన “చక్రం” సినిమాను రీ-రిలీజ్ చేయాలని భావిస్తున్నారు కొంతమంది. కృష్ణవంశీ దర్శకత్వంలో అటుఇటుగా 20 ఏళ్ల కిందటొచ్చిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అనిపించుకుంది.
ఇప్పుడీ సినిమాను సరిగ్గా “కల్కి 2898 AD” రిలీజ్ అవుతున్న ఇదే నెలలో విడుదల చేయబోతున్నారు. ఈనెల 8న ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోందన్న మాట నిజమే. ప్రభాస్ సినిమాలు కూడా కొన్ని రీ-రిలీజ్ అయ్యాయి. కానీ కల్కి ముందు చక్రం లాంటి సినిమాను విడుదల చేయడం రాంగ్ ప్లానింగ్ అనిపించుకుంటుంది.