
పూజ హెగ్డే తెలుగులో నెంబర్ వన్ స్థానంలో చాలా కాలం కొనసాగింది. కానీ అలాంటి భామకి ఇప్పుడు తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. రెండేళ్లుగా ఒక్క చిత్రం దక్కలేదు ఆమెకి. దాంతో తమిళం వైపు చూపు వేసింది. వెంటనే ఆఫర్లు లాగేసుకొంది. తమిళంలో మూడు, హిందీలో ఒక సినిమా చేస్తోంది ఇప్పుడు.
ఐతే, ఆమెకి మాత్రం ఇంకా తెలుగులో జరిగిన అవమానం గుర్తుకొస్తోంది. అందుకే, తెలుగు సినిమాల హీరోల పేర్లు, దర్శకుల గురించి, నిర్మాతల గురించి ప్రస్తావన తీసుకురాకుండా ఆమె అనేక విషయాలు చెప్తోంది. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఒక తీరుగా మర్యాద, గౌరవం ఉంటుంది, హీరోయిన్లకు ఒక తీరుగా ఉంటుంది అని చెప్తోంది. నెంబర్ వన్ హీరోయిన్ అయినా హీరోలకు సమానంగా “ట్రీట్మెంట్” ఉండదు అని చెప్తోంది.
తెలుగులో ఒక పెద్ద హీరో సినిమాలో నటించినప్పుడు ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని అవమానాలు పొందింది. అప్పటికే ఆమె తెలుగులో టాప్ పొజిషన్ కి చేరుకొంది. అందుకే హీరోయిన్లు నెంబర్ వన్ పొజిషన్ కి చేరినా సరైన గౌరవం రాదు అని ఇప్పుడు మాట్లాడుతోంది.
అలాగే, ఒక్కో హీరోయిన్ ని ఒక్కో చట్రంలో ఇరుక్కునేలా చేస్తారని చెప్తోంది. గ్లామర్ భామ అని చెప్పి నటనకి స్కోప్ ఉండే పాత్రలు ఇవ్వరు. నటించే వారికి గ్లామర్ రోల్స్ కి తీసుకోరు. గిరిగీసి హీరోయిన్లకు హద్దులు పెడుతారు. అందుకే హీరోయిన్లకు వైవిధ్యమైన సినిమాలు రావు అంటోంది ఈ భామ.

ఇంకా ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే పారితోషికాల గురించి, ఇతర విషయాల గురించి కూడా చాలా ఓపెన్ గా మాట్లాడింది. చూస్తుంటే ఎవరిపైనో గ్రడ్జ్ పెట్టుకొని కసిగా మాట్లాడినట్లు కనిపిస్తోంది.