
ఏటా ఇచ్చే ఆస్కార్ అవార్డు కేటగిరీల్లో ఇప్పటివరకు యాక్షన్ కొరియోగ్రఫీని గుర్తించలేదు. హాలీవుడ్ సినిమాల్లో అధికంగా యాక్షన్ సీన్లే ఉంటాయి. అయినా, ఫైట్స్ మాస్టర్లను, యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేసే వారి కళకు ఇంకా గౌరవం దక్కలేదు. చాలా కాలంగా ఈ కేటగిరిలో కూడా అవార్డు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తుండడంతో అకాడమీ ఒప్పుకొంది.
ఆస్కార్ అవార్డులు నెలకొల్పి మరో రెండేళ్లలో 100 ఏళ్ళు కాబోతోంది. ఈ సందర్భంగా 2027 నుంచి స్టంట్ డిజైన్ అనే పేరుతో యాక్షన్ డైరెక్టర్లకు అవార్డు ఇవ్వనుంది ఆస్కార్ అకాడెమీ.
ఈ సందర్భంగా గొప్ప ఫైట్ సీన్లు ఉన్న కొన్ని సినిమాలను అకాడెమీ ప్రస్తావించింది. అందులో మన రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్” చిత్రం ప్రస్తావన ప్రత్యేకంగా వచ్చింది. దాంతో అకాడెమీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాజమౌళి ట్వీట్ చేశారు.
వందేళ్ల నిరీక్షణ ఫలించింది అని చెప్పారు రాజమౌళి. “ఆర్ ఆర్ ఆర్” సినిమాలోని ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టంట్ సీన్ ని ప్రముఖంగా థంబ్ నెయిల్ లో వాడింది అకాడెమీ.