కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా స్పందించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన తాత స్థాపించిన టీడీపీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా చంద్రబాబును మామయ్యా అంటూ ఎన్టీఆర్ సంభోదించడం చాలామందికి నచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపాడు తారక్. చంద్రబాబు మామయ్యా మీకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ పెట్టాడు. అదే ట్వీట్ లో పురందేశ్వరిని అత్త అని, బాలయ్యను బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచాడు ఎన్టీఆర్.
ఇక పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా ఓ ట్వీట్ కేటాయించాడు. ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అటు మహేష్ బాబు కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్రమోదీకి శుభాకాంక్షలు అందించాడు. ప్రజలు పెట్టుకున్న నమ్మకం, ప్రేమకు గుర్తుగా ఈ గెలుపు లభించిందంటూ పవన్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఐదేళ్లలో కలలను సాకారం చేయాలని ఆకాంక్షించాడు.