
“పుష్ప 2” సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. కానీ తెలంగాణలో ఆ సినిమా అనేక కష్టాలు తెచ్చిపెట్టింది నిర్మాతలకు, హీరో అల్లు అర్జున్ కి. “పుష్ప 2” ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరగడం, ఒక మహిళ చనిపోవడంతో జరిగిన గొడవ, అరెస్టులు, కేసుల తల నొప్పి నుంచి మైత్రి సంస్థ ఇంకా కోలుకోలేదు.
అందుకే నిర్మాత రవిశంకర్ తమ తాజా చిత్రం “రాబిన్ హుడ్”కి ప్రీమియర్ షోలు వెయ్యట్లేదు అని చెప్పారు. “మాకు ప్రీమియర్ షోలు కలిసి రాలేదు,” అని ఆయన సమాధానం ఇచ్చారు. ఇకపై మైత్రి సంస్థ తీసే సినిమాలు ప్రీమియర్ షోలకు దూరంగా ఉంటాయి.
మైత్రి సంస్థ తమిళంలో నిర్మించిన అజిత్ మూవీ “గుడ్ బ్యాడ్ అగ్లీ”, హిందీలో నిర్మించిన “జాట్” ఒకేరోజు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 10న ఈ రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఇలా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీ సినిమాలు తీస్తున్న ఈ సంస్థ 2026పై ఎక్కువ ఆశలు పెట్టుకొంది.
“2026 మా సంస్థకు ప్రత్యేకం కాబోతోంది. ప్రభాస్ – హను రాఘవపూడి చిత్రం, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ, రామ్ చరణ్ – బుచ్చిబాబు చిత్రం, జై హనుమాన్… ఇలా భారీ పాన్ ఇండియన్ సినిమాలు 2026లో రిలీజ్ అవుతాయి. విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యాన్ మూవీ కూడా వచ్చే ఏడాదే వస్తుంది. 2026లో తమిళంలో, హిందీలో కూడా సినిమాలు ఉంటాయి,” అని రవిశంకర్ తెలిపారు.