
నాని సినిమా షూటింగ్ మొదలుపెట్టకముందే ఆ సినిమాని ఎప్పుడు విడుదల చెయ్యాలి అనే విషయంలో ఒక ప్లాన్ కి వస్తాడు. దానికి అనుగుణంగా షూటింగ్ స్టార్ట్ చూసి టీంని రెడీ చేస్తాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని “ది ప్యారడైజ్” అనే సినిమాని ఇటీవల ప్రకటించాడు. ఈ సినిమాని మార్చి 26, 2026న విడుదల చేస్తానని చెప్తూ ఒక టీజర్ కూడా విడుదల చేశాడు నాని.
ఐతే, మార్చి 2026 చివరి వారంలో ఉగాది, రంజాన్ వస్తున్నాయి. దాదాపు నాలుగు, ఐదు రోజుల సెలవు దినాలు ఉన్నాయి. దాంతో ఈ పీరియడ్ ని టార్గెట్ చేస్తూ తాజాగా కన్నడ సూపర్ స్టార్ తన “టాక్సిక్” సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశాడు. ఆ సినిమా మార్చి 19, 2026న విడుదల కానుంది.
ఇక రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న స్పోర్ట్స్ చిత్రాన్ని (‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారు) మార్చి 26, 2026న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు అని టాక్. ఈ విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ఒకవేళ రామ్ చరణ్ సినిమా కనుక నిజంగా మార్చి 26, 2026న వస్తే నాని సినిమాని వాయిదా వెయ్యక తప్పదు. రామ్ చరణ్ సినిమాతో నాని పోటీపడడు. పైగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని త్వరలో చిరంజీవితో ఒక సినిమా నిర్మించనున్నాడు. సో, ఈ రెండు సినిమాలు పోటీపడవు.
ఐతే, రామ్ చరణ్ సినిమా నిజంగా మార్చి 26న వస్తుందా రాదా అనే విషయం తేలాకే నాని నిర్ణయానికి వస్తాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. ప్రస్తుతం నాని “హిట్ 3” సినిమా విడుదల, ఆ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు.