
మనకున్న నలుగురు టాప్ సీనియర్ హీరోల్లో ముగ్గురు ఫామ్ లోకి వచ్చారు. బాలయ్య ఇప్పటికే 100 కోట్ల రూపాయల హిట్స్ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి భారీ హిట్స్ ఉన్నాయి. వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో కళ్ళు చెదిరే హిట్ ఇచ్చారు. వారితో సమానంగా క్రేజ్ ఉండి అప్పట్లో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న నాగార్జున ఇప్పుడు రేస్ లో పూర్తిగా వెనుకబడ్డారు.
ఆయన కూడా సోలో హీరోగా ఒక భారీ హిట్ బాకీ ఉన్నారు. అందుకే, నాగార్జున తదుపరి చిత్రం గురించి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
నాగార్జున ప్రస్తుతం సోలో హీరోగా సినిమాలు చెయ్యట్లేదు. రజినీకాంత్ సినిమా “కూలీ”లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తీస్తున్న “కుబేర”లో కూడా నాగార్జున ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఇవన్నీ క్యారెక్టర్ రోల్స్. మరి హీరోగా ఆయన సోలో షో ఎప్పుడు?
నాగార్జునకి ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు. గతేడాది సంక్రాంతికి వచ్చిన “నా సామి రంగా” హిట్ అంటే హిట్ అన్నట్లుగా ఆడింది. సంక్రాంతి సందడిలో తప్ప మాములుగా ఆయన సినిమాలు ఆడుతాయా అన్నది డౌట్. అందుకే, నాగార్జున ఇప్పట్లో సోలో సినిమాలపై ఆసక్తి చూపకపోవచ్చు.