
మొన్నటివరకు ట్విట్టర్లో తెగ హడావిడి చేసిన నాగబాబు ఉన్నట్టుండి తన అకౌంట్ ని డీ యాక్టివేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్ వ్యతిరేకంగా నాగబాబు పోస్ట్ పెట్టారనే ఉద్దేశంతో చాలా గొడవ చేశారు బన్ని ఫ్యాన్స్. దానికి తోడు సొంత వాళ్ళతో కూడా సమస్యలు వచ్చినట్లు ఉన్నాయి. అందుకే, ఆయన సడెన్ గా వెళ్లిపోయారు ట్విట్టర్ నుంచి.
ఇటీవల అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన మిత్రుడు శిల్ప రవికి మద్దతు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధికార పక్షం వైఎస్సార్సీ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేస్తుండగా అల్లు అర్జున్ విచిత్రంగా నంద్యాల్లో అధికార పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు.
ఈ చర్య మెగా ఫ్యామిలీలో రచ్చ రేపింది. దాంతో పోలింగ్ ముగిసిన వెంటనే నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే.” అనేది నాగబాబు పోస్ట్ సారాంశం.
బన్ని పేరు ఎక్కడా లేదు కానీ బన్నీనే టార్గెట్ చేసి నాగబాబు ఈ ట్వీట్ పెట్టారు అనే హడావిడి జరిగింది. ఇప్పుడు నాగబాబు ట్విట్టర్ నుంచి వెళ్లిపోయారు. ఇది తాత్కాలికమా లేక శాశ్వతంగా ట్విట్టర్ కి ఆయన దూరంగా ఉంటారా అనేది చూడాలి.