“దేవర” సినిమాకి సంబంధించిన రెండో పాట వచ్చింది. “చుట్టమల్లే” అనే ఈ రెండో పాటలో ఎన్టీఆర్ ని తలుచుకుంటూ హీరోయిన్ జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తుంది. ఇది ఫిమేల్ పాట అన్నమాట. హీరో గొంతు విప్పడు ఇందులో.
ఎన్టీఆర్ చాలా స్టయిల్ గా ఉన్నాడు ఈ పాటలో. ఇక జాన్వీ కపూర్ అందంగా మెరిసింది. ఐతే, అనిరుధ్ ఈ పాట ట్యూన్ ని ఒక శ్రీలంక పాట నుంచి లేపాడు అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం యొహిని అనే ఒక శ్రీలంక గాయని పాడిన “మణిక మగ హితే” (“Manike Mage Hithe”) అనే పాట ఇండియాలో కూడా బాగా వైరల్ అయింది. అచ్చు గుద్దినట్లు ఈ “చుట్టమల్లే” ట్యూను ఉంది అనేది చాలా మంది మాట.
అనిరుధ్ రవిచందర్ కూడా కాపీ కొడతాడా అనే డౌట్ చాలామంది ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ స్పందించారు.
“#చుట్టమల్లె గత 24 గంటల నుండి లూప్‌లో వింటున్నా … అబ్బాయిలూ జోష్ ఎలా ఉంది. అన్న తారక్ ని చూస్తే ముచ్చటేస్తుంది, జాన్వీని చూస్తే ముద్దొస్తోంది. ఎవరు ఎలా అనుకోని? దేంతో కంపేర్ చేస్తే మనకి ఏంటి కదా అబ్బాయిలు?” అని నాగవంశీ ట్వీట్ చేశారు.
ఆయన ఈ సినిమాకి నిర్మాత కాదు. కానీ ఎన్టీఆర్ కి వీరాభిమాని. అలాగే “దేవర” సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులు ఆయన తీసుకున్నారు.