
మూడో చిత్రంతోనే పెద్ద దర్శకుడిగా మారిపోయాడు నాగ్ అశ్విన్. “ఎవడే సుబ్రహ్మణ్యం”, “మహానటి” చిత్రాల తర్వాత నాగ్ అశ్విన్ తీసిన మూవీ… కల్కి 2898 AD. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
ఈ సినిమాకి రెండో భాగం కూడా తీస్తున్నాడు నాగ్ అశ్విన్. మూడు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో వేర్వేరు నటులు నటించారు. మొదటి చిత్రంలో నాని హీరో. రెండో చిత్రంలో కీర్తి సురేష్ మెయిన్ రోల్. మూడో చిత్రంలో ప్రభాస్ కథానాయకుడు. ఐతే, ఈ మూడు సినిమాల్లోనూ విజయ్ దేవరకొండ ఉన్నాడు. “ఎవడే సుబ్రహ్మణ్యం” చిత్రంలో రెండో హీరోలాంటి పాత్ర. “మహానటి”లో జర్నలిస్ట్ టీంలో ఒకరిగా కనిపించాడు. “కల్కి 2898 AD”లో అర్జునుడిగా నటించాడు.
ఐతే “కల్కి 2898 AD”లో విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీపై ఒక వర్గం నానా రచ్చ చేసింది. ఇటీవల కొన్ని “బలమైన” శక్తులకి చెందిన వారు కొంతకాలంగా విజయ్ దేవరకొండని టార్గెట్ చేశారు. తెగ ట్రోలింగ్ చేస్తోంది ఆ శక్తుల బృందం. “కల్కి 2898 AD” విషయంలో కూడా జరిగింది. ఐతే, నాగ్ అశ్విన్ మాత్రం ఈ మూకని పట్టించుకోవడం లేదు.
“నేను తీసే అన్ని సినిమాల్లో విజయ్ దేవరకొండ ఉండేలా చూసుకుంటా. ఎదో ఒక పాత్రలో నా సినిమాలో అతను కనిపిస్తాడు,” అని ప్రకటించాడు.
నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ చాలా కాలంగా స్నేహితులు. శేఖర్ కమ్ముల “హ్యాపీ డేస్” తీస్తున్న సమయంలో వీరికి స్నేహం ఏర్పడింది. అప్పుడు నాగ్ అశ్విన్ కమ్ముల వద్ద సహాయ దర్శకుడు. విజయ్ ఆ సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. అప్పటి నుంచి వారి ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతోంది.