కియారా అద్వానీకి 30 ఏళ్ల తర్వాత ఒక ఆట గురించి తెలిసింది. అదీ కూడా పెళ్ళయిన తర్వాత ఆమె భర్త ఆ ఆటని ఆస్వాదించేలా చేశాడట. ఆ ఆట … టెన్నిస్.
ప్రస్తుతం 2024కి సంబంధించిన వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ (The Championships, Wimbledon 2024) జరుగుతోంది. ఈ ఆటని డైరెక్ట్ గా చూసేందుకు ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా లండన్ వెళ్లారు. టెన్నిస్ గురించి అంతగా ఆసక్తి లేని కియారాని కూడా తోడుగా తీసుకెళ్ళడట. దాంతో ఈ భామ ఆటని ప్రత్యక్షంగా చూసి మురిసిపోతూ ఫోటోలు షేర్ చేసింది.
“నిజం చెప్తున్నా… ఇటీవల నా భర్త నాకు టెన్నిస్ పరిచయం చేశారు… ప్రత్యక్షంగా వింబుల్డన్ చూడడం మరిచిపోలేని అనుభవం. సెంటర్ కోర్ట్, స్ట్రాబెర్రీలు, ఐస్ క్రీమ్, అద్భుతమైన గేమ్ … వీటికన్నా మరో మధురమైన అనుభూతి ఏముంటుంది?,” అని చెప్పుకొచ్చింది ఈ భామ.
కియారా ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన “గేమ్ ఛేంజర్” సినిమాలో నటిస్తోంది. ఆమెకి ఇది తెలుగులో మూడో చిత్రం. హిందీలో ఆమె ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. “డాన్ 3”, “వార్ 2” వంటి బడా సినిమాల్లో ఈ అమ్మడే హీరోయిన్.
ఇక కేజీఎఫ్ హీరో యష్ కొత్త సినిమాలో కూడా కియారా మెయిన్ హీరోయిన్. ఇలా పెద్ద సినిమాల్లో నటిస్తూ సరదాగా భర్తతో ఇలా వెకేషన్ కి వెళ్లి కొత్త ఆటని “నేర్చుకొంది.”