ఊహించనట్లే “పుష్ప 2” సినిమా టీజర్ అదరగొట్టింది. దర్శకుడు సుకుమార్ మరోసారి తన మార్క్ చూపించారు. ఇక అల్లు అర్జున్ ఇప్పటికే మొదటి భాగంలో తన నటనకి జాతీయ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు రెండో భాగంలో కూడా ‘స్టన్నింగ్’ మార్క్ చూపించారు.
ఈ టీజర్లో అల్లు అర్జున్ ‘గంగమ్మ జాతర’లో పాల్గొనేందుకు ఆ దేవతలా వేషం వేసుకొనే వాడిగా కనిపించారు. ఆ ఆడ వేషంలో బాడీ లాంగ్వేజ్, కొంగును దోపుకునే తీరు, కాలును తిప్పే విధానం అదిరిపోయాయి.
సెలెబ్రిటీలు కూడా ఈ టీజర్ అదిరిపోయింది అని మెచ్చుకుంటున్నారు. నాని, అనసూయ వంటి స్టార్స్ ఇప్పటికే తెగ మెచ్చుకున్నారు. అల్లు అర్జున్ కి మరోసారి జాతీయ అవార్డు రావడం ఖాయం అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
అల్లు అర్జున్ విశ్వరూపం!
అల్లు అర్జున్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూడబోతున్నాం అని మేకర్స్ అంటున్నారు. సాధారణంగా ఒక పెద్ద హీరో ఇలాంటి గెటప్ వేసేందుకు ఒప్పుకోరు. కానీ బన్నీ ఈ సినిమా కోసం ఎలాంటి ఇగోలు పెట్టుకోలేదు. పాత్రకు తగ్గట్లు, దర్శకుడు సుకుమార్ విజన్ కి తగ్గట్లు నటిస్తున్నారు అని అర్థమవుతోంది.
“పుష్ప 2” విడుదలకు ఇంకా నాలుగు నెలల టైం ఉంది. కానీ అప్పుడే టీజర్ వచ్చేసింది. ఈరోజు బన్నీ పుట్టిన రోజు. అందుకే ఈ సినిమాలోని “గంగమ్మ జాతర”కి సంబంధించిన సన్నివేశంలో ఒక చిన్న భాగాన్ని టీజర్ గా మలిచి విడుదల చేశారు.
చిత్తూరు, తిరుపతి పరిసరాల్లో గంగమ్మ జాతర చాలా పాపులర్. ఈ జాతరలో భక్తులు ఇలా గంగమ్మలా వేషం కడుతారు. అల్లు అర్జున్ ఇలా వేషం కట్టి ఈ జాతరలో తన ప్రత్యర్థుల ఆటలు కట్టించే సీన్ ఇది.
టీజర్ తో అంచనాలు ఈ రెండో భాగంపై మరింత పెరిగాయి.